full screen background image
Search
Tuesday 26 March 2019
  • :
  • :

ఆదర్శ పురుషుడు శ్రీరామ చంద్రుడు

sri ramudu

రామో విగ్రహవాన్ ధర్మః… ధర్మం యొక్క నిలువెత్తు ప్రతిరూపమే రాముడు అని దీని అర్థం. భగవంతుడు దశావతారాలు ఎత్తి… ధర్మప్రతిష్టాపన గావించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి అవతారంలోనూ భగవంతుడు ధర్మప్రతిష్టాపన గావిస్తే… మరి రాముణ్నే ధర్మం యొక్క ప్రతిరూపంగా భావించడంలో ఆంతర్యం ఏమిటి. రామకథను గమనిస్తే… ఈ విషయం మనకు అవగతమౌతుంది.

మాటల్లో చెప్పేది ధర్మం కాదు. మౌనంగా వివరించేది ధర్మం కాదు. చేసి చూపించేది ధర్మం కాదు. ధర్మం అంటే ఆచరించి చూపించేది. అనుసరించి వివరించేది. రామావతారంలో భగవంతుడు చేసింది ఇదే. ధర్మాన్ని ఆచరించాడు. ధర్మం కోసం నిలబడ్డాడు. అందుకే రాముడు ధర్మానికి ప్రతిరూపంగా నిలిచాడు.

ఇక్కడ మనకు ధర్మమంటే ఏమిటి… రాముడు ఆచరించిన ధర్మం ఏమిటి అనే ప్రశ్నలు కచ్చితంగా ఉద్భవిస్తాయి. నిజమే… ధర్మం అంటే ఏమిటి. మనిషి మనిషిగా జీవించడానికి ఏర్పరచిన నియమాల సమూహమే ధర్మము. పుట్టిన నాటి నుంచి… బిడ్డగా, అన్నగా, భర్తగా, తండ్రిగా… ఇలా ఎన్నో రూపాల్లో మనిషి తన విధులను నిర్వహిస్తూ… ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను అనుసరించాలి. నాల్గింటిలో తొలి ప్రాధాన్యత ధర్మానికే ఇచ్చారు. అంటే మిగిలినవన్నీ ధర్మంతోనే సాధ్యం. అర్థం, కామం ధర్మంతో పెనవేసుకు పోయినప్పుడు తనంతట తానుగా… మోక్షం మనిషిని వరించి వస్తుంది.

మరి రాముడు ధర్మాన్ని ఏ విధంగా పాటించాడనే అంశాన్ని సైతం ఇక్కడ గమనించాలి కదా. తొలుత పుత్రుడుగా రాముడు ధర్మాన్ని ఎలా పాటించాడో గమనిద్దాం. సాక్షాత్తు భగవంతుని అవతారమైన శ్రీరామచంద్రుడు… తండ్రి మాటకు కట్టుబడి విశ్వామిత్రునితో యాగ సంరక్షణకు వెళ్ళాడు. తండ్రి మాట కోసమే కాసేపట్లో రాజు కావలసి ఉండి, ఆనందంగా వనవాసానికి వెళ్ళాడు. తండ్రి మాట కోసమే 14 ఏళ్ళు పడరాని కష్టాలు పడ్డాడు. ఇవన్నీ రావణుణ్ని సంహరించడానికేనా అంటే.. అవునో కాదో చెప్పలేం కానీ… ఇవన్నీ లేకుండా కూడా రావణ సంహారం చేయవచ్చు. కానీ ఇవన్నీ ఉన్నాయి కనుకే, ధర్మాచరణ చేశాడు గనుకే… మానవ రూపంలో ఉన్న దేవుడిగా రాముణ్ని పూజిస్తున్నాం.

సాక్షాత్తు భగవంతుడు అయ్యి ఉండి కూడా… గురు సుశ్రూష చేసి సకర శస్త్రాస్త్రాలను సముపార్జించిన రాముడు శిష్య ధర్మానికి సైతం కట్టుబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. వశిష్టుడి దగ్గర విద్యాభ్యాసం చేసి, విశ్వామిత్రునికి సుశ్రూషలు చేసి బల, అతిబల విద్యలు సముపార్జించాడు. సాక్షాత్తు నారాయణుడు అయ్యి ఉండి, శివచాపానికి ఎంతో గౌరవం ఇచ్చాడు. శివదనుర్భంగం జరిగిన తర్వాత పరశురాముడు కోపిస్తే… శాంతంగా సమాధానం చెప్పి మెప్పించాడు. శ్రీరాముడి ధర్మం ముందు భార్గవ రాముడి కోపం నిలవలేకపోయింది.

అన్నగా శ్రీరాముని ధర్మ నిరతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అగ్రజుడు ఏ మార్గాన్ని అనుసరిస్తే… సహజాతులంతా అదే మార్గాన్ని అనుసరిస్తాయి. లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు అంత గొప్ప వారిగా తయారు కావడానికి కారణం రాముని ధర్మబుద్ధే. తండ్రిమాటకు అడవులకు వెళ్తున్న అన్నకు తోడుగా వెళ్లిన లక్ష్మణుడు రాముడి ధర్మనిరతిని పుణికి పుచ్చుకున్న వాడే. ఏనాడూ సీతమ్మ పాదాలను తప్ప మోము చూసి మాట్లాడని లక్ష్మణుని ధర్మ నిరతి ఏంత చెప్పుకున్నా తక్కువే. రాజు అయ్యే అవకాశం లభించినా… సోదరుని పాదుకలకు పట్టాభిషేకం చేసిన భరతుని అంతటి ధర్మనిరతి ఎక్కణ్నుంచి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాలంటారా.

ఇక భర్తగా శ్రీరాముని ధర్మనిరతి గురించి లోకాలు వేనోళ్ళా కొనియాడుతున్నాయి. సీతమ్మ తల్లి ఎన్నో కష్టాలు అనుభవించింది. నిజమే. కానీ అదంతా సతీ ధర్మాన్ని లోకానికి చాటిచెప్పేందుకే. అన్ని కష్టాలు అనుభవించి కూడా… ఏనాడూ బాధ పడకపోవడానికి కారణం… లోకపావని అయిన ఆ తల్లి… స్వయంగా వీక్షించిన శ్రీరామచంద్రుని ధర్మనిరతే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

రాజుగానూ శ్రీరాముని ధర్మ నిరతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సేవకాజనంతో ఎంతో మర్యాదగా ప్రవర్తించే వాడని రామాయణం మనకు తెలియజేస్తుంది. ఏ వేళకావేళ ఎవరితో తగ్గట్టు వారితో… శ్రీరాముని ప్రవర్తన… భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేసింది. శత్రువుగానూ శ్రీరామచంద్రుడు ఉత్తమ ధర్మాచరణా పరుడే. మారీచ సుబాహుల తల్లిని సంహరించే సమయంలో గానీ, శూర్పణఖను దండించే సమయంలో గానీ, వాలి వధలో గానీ, రాక్షసులతో పోరు సలిపే సమయంలో కానీ ఎక్కడా శ్రీరాముడు ధర్మాన్ని విడనాడలేదు. రావణ సంహారం ముగిసిన తర్వాత సాక్షాత్తు నారాయణ స్వరూపమైన నరుడు అయ్యి కూడా…. బ్రహ్మహత్యా దోషం తగలకుండా… రామేశ్వర లింగాన్ని ప్రతిష్టించడంలోనూ శ్రీరాముని ధర్మ నిరతి మనకు అర్థమౌతుంది.

ఇలా రాముని జీవితంలో ఏ సందర్భాన్ని వెతికినా… రాముడి ధర్మాచరణ మనకు అర్థమౌతుంది.  ధర్మాన్ని తెలిసి ఆచరించేవారు మధ్యమలు కాగా… ధర్మాన్ని తెలిసీ ఆచరించని వారు అథములు. అయితే ధర్మాన్ని తెలుసుకుని ఆచరించే వారు మాత్రం ఉత్తములు. అలాంటి ఉత్తమ ధర్మాచరణపరుడే శ్రీరామచంద్రుడు. అందుకే రాముడు ధర్మానికి ప్రతిరూపమయ్యాడు. మానవ ధర్మాన్ని ఆచరించి యుగపురుషుడయ్యాడు.

మానవుల్లో పుట్టి, మానవుడిలాగే లౌకిక జీవనాన్ని గడపి, ఆచరణలో మహోన్నత ఆదర్శాలను మనకు అందించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఒకే మాట, ఒకే బాణం, ఒక్కతే భార్య అనే మహాపురుషుడి అచరణ మనకు ఆదర్శనం కావాలి.

  • 2
    SharesLeave a Reply

Your email address will not be published. Required fields are marked *


Close
error: Content is protected !!