full screen background image

తిరుమల శ్రీవారికి కులదైవం ఉన్నాడా..?

tirumalesuni kuladaivam

 

వేదాలే శిలలై వెలసిన కొండ, భక్తకోటి ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటే కొండ, ఎన్నో కష్టాలకోర్చి, గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో ఉండి క్షణకాలం పాటు తిరుమలేశుని దర్శనంతో భక్తులంతా పులకించి పోతారు. అలాంటి తిరుమలేశుడు కోట్లాది భక్తుల కన్నుల పంట.

ఏ కుటుంబానికైనా ఓ కులదైవం ఉంటాడు. వివాహ సమయంలో ఆ స్వామిని పూజించి, వివాహం చేసుకుంటారు. మరి తిరుమలేశుడు పద్మావతి దేవిని వివాహం చేసుకునే సమయంలో పూజించిన భగవత్ స్వరూపం ఎవరో తెలుసా… సాక్షాత్తు అహోబల నృసింహుడే.

ఇప్పటికీ దిగువ అహోబిలంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ స్వామి పూజ తర్వాతే శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడాడు.

తిరుమల వెళ్ళినప్పుడు గమనిస్తే… తిరుమలేశుని హుండీకి ఎదురుగా నృసింహ స్వామి ఆలయం కనిపిస్తుంది. అదే విధంగా తిరుమల నడక దారిలోనూ అనేక నృసింహ ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఇక ఉత్తర మాడవీధిలో ఆహోబల మఠాన్ని మనం గమనించవచ్చు. ఇలా తిరుమలకు, అహోబిలానికి మధ్య ఆధ్యాత్మిక వారధి కనిపిస్తుంది.

ఇంకా చెప్పాలంటే తిరుమల నిజానికి వరాహ క్షేత్రం. వరాహస్వామి, తిరుమలేశునికి చోటు ఇచ్చాడని ప్రతీతి. వరాహ రూపాన్ని, నృసింహ రూపాన్ని రెండింటినీ ఒకటిగానే భావిస్తారు. ఆ విధంగా తిరుమలతో వరాహనృసింహుల ఆధ్యాత్మిక బంధాన్ని మనం గమనించవచ్చు.

ఇక్కడ ఒక దేవుడు మరో దేవుణ్ని ఎలా పూజిస్తారనే సందేహం అవసరం లేదు. రామావతారంలో సాక్షాత్తు శ్రీరాముడే రామేశ్వర లింగాన్ని ప్రతిష్టించాడు. అదే విధంగా తిరుమలేశుడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే అయినప్పటికీ, సంప్రదాయాలను గౌరవిస్తూ… మరో విష్ణు స్వరూపమైన నృసింహ స్వామిని పూజించాడని చెప్పడంలో ఏ విధమైన సందేహం అవసరం లేదు కదా.




One thought on “తిరుమల శ్రీవారికి కులదైవం ఉన్నాడా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Close
error: Content is protected !!